స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోకాపేటలో చాలా ఖరీదైన రెండున్నర ఎకరాల భూమిని పద్మశాలి ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి కేటాయిం చడం చాలా గొప్ప నిర్ణయమని అన్నారు. 150 కోట్లు విలువచేసే ఈ భూమిని కేటాయించడం చాలా సంతోషకరమని అన్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి అన్ని విధాలుగా కేసీఆర్ ప్రభుత్వం తోడుగా ఉందన్నారు.
ఇప్పటివరకు నేతన్నల కోసం 5800 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టిందని వ్యాఖ్యానించారు. నేతన్నకు ఆసరా పెన్షన్ కావచ్చు.. పవర్ లూమ్ కు కరెంట్ సబ్సిడీ కావచ్చు.. హ్యాండ్లూమ్ కు రసాయనాలపై సబ్సిడీ కావచ్చు.. ఇలా నేతన్నకు బీమా కావచ్చు.. అనేక అంశాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం తోడుగా ఉందన్నారు. బతుకమ్మకు ప్రజలకు పంపిణీ చేసే చీరల కాంట్రాక్టు కూడా తెలంగాణ నేతలకే ఇవ్వడం గొప్ప విషయని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పద్మశాలి సామాజికవర్గ ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.