30.2 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

వైసీపీలోకి క్యూ కట్టిన ప్రతిపక్ష నేతలు …..

     ఏపీలో ఎన్నికల జాతర యమ రంజుగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. జగన్‌ని గద్దె దించడమే టార్గెట్‌గా విపక్ష కూటమి పావులు కదుపుతుంటే.. వారి ఎత్తులను చిత్తు చేసే వ్యూహాల్లో ఉన్నారు వైసీపీ అధినేత. జగన్‌ టార్గెట్‌గా ఏర్పడిన కూటమికి అసంతృప్తులు, నిరసన సెగలు తలనొప్పిగా మారుతుంటే.. వారిని తమవైపుకి తిప్పుకుని కూటమి అధినేతలకు షాక్‌ ఇస్తున్నారు జగన్‌. ఈ ఎత్తుగడలో భాగంగానే వైసీపీలో చేరికల జోరందుకుంది.

      ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ కంకణం కట్టుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. అదే వ్యూహంతో అంతా తానై కూటమి ఏర్పాటుకు పెద్దన్న పాత్ర పోషించారు. ఎన్నికల రణరంగంలో జగన్‌ను గద్దె దించి.. అధికార పగ్గాలు చేపట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటయ్యాయి. ఉమ్మడి కార్యాచరణతో అధికార పార్టీ నేతలను మట్టికరిపించే పనిలోపడ్డాయి. అయితే,… కొన్ని చోట్ల అదే వ్యూహం వారి కొంప ముంచుతోంది. ఈ గట్టునున్న నేతలు ఆ గట్టుకు తరలివెళ్తుంటే ప్రేక్షక పాత్ర పోషించక తప్పడం లేదు. పొత్తు ధర్మాన్ని అధినేతలు బాగానే పాటిస్తూ ఓ చోట తగ్గుతూ.. మరో చోట త్యాగాలు చేస్తూ ముందుకు సాగుతుంటే.. అందుకు ససేమిరా అంటున్నారు పార్టీ నేతలు. పొత్తుతో మాకేంటి సంబంధం..? మా సీటు సంగతి తేల్చండంటూ నిలదీస్తున్నారు. బుజ్జగింపులకు లొంగేదే లేదంటూ ఎవరినైతే ఢీకొట్టాలనుకున్నారో వారి పంచనే చేరి మీ అంతు చూస్తామంటున్నారు. తమను కాదని టికెట్‌ వేరే వాళ్లకి ఇవ్వడంతో ప్రజాక్షేత్రంలో మీ ఓటమికి మేము సైతం అంటూ కాలుదువ్వుతున్నారు. ఇక ఇదే అదునుగా ఎన్నికల ప్రచార హోరులో స్పీడ్‌ పెంచిన సీఎం జగన్‌ బస్సు యాత్ర చేస్తూ ఓ పక్క ప్రజలకు చేరువవుతూనే.. మరోపక్క అసంతృప్తులకు గాలెం వేసి తమ వైపుకి తిప్పుకుంటూ విపక్షాలకు షాక్‌ ఇస్తున్నారు.

     ఏపీ విపక్ష కూటమిలో విబేధాలు భగ్గుమంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా రాజకీయ భవిష్యత్తు కోసం ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకుంటున్నారు. అసంతృప్త నేతలకు అటు నుంచి అధికార పార్టీ సాదరంగా స్వాగతం పలుకుతోంది. దీంతో టీడీపీ, జనసేన ఆశావహులంతా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ 175 అసెంబ్లీ, 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆ పార్టీలో కొత్తగా వచ్చే వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేకపోయినా సరే వైసీపీలో చేరేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు ఉత్సాహం చూపుతున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ నేతలను ఓడించేందుకు అధికార పార్టీతో చేతులు కలిపేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలామంది నేతలు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. మరి కొంతమంది అదే బాటలో పయనిస్తున్నారు.

      తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమామహేశ్వర నాయుడు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి కళ్యాణదుర్గం టిక్కెట్టు ఆశించి భంగపడ్డారు. దీంతో ఉమామహేశ్వర నాయుడు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు రాజంపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత చంగలరాయుడు కూడా పార్టీ ఫిరాయించే యోచనలో ఉన్నారు. తనకు టికెట్‌ ఇవ్వకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. నేడో రేపో వైపీపీలో చేరే అవకాశముందున్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన జితేందర్‌ కూడా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోగా వైసీపీ నుంచి కొత్తగా టీడీపీలో చేరిన గుమ్మనూరు జమరామ్‌కు టికెట్‌ కేటాయించడంపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు టీడీపీ రాజంపేట ఇంఛార్జి గంటా నరహరి ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామ కోటయ్య తాజాగా జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు.

      ఒక్క టీడీపీనే కాదు.. జనసేనలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆశావహులంతా వైసీపీలోకి క్యూకట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజక వర్గం నుంచే ఆ పార్టీ నేతలు వైసీపీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో పిఠాపురం బరిలో దిగిన జనసేన అభ్యర్థి శేషు కుమారి అధికార పార్టీలో చేరారు. అలాగే గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన పితాని బాలకృష్ణ కూడా జనసేనకు గుడ్ బై చెప్పి, సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ హైకమాండ్‌పై ఆగ్రహంగా ఉన్న నేతలంతా రానున్న రోజుల్లో జగన్‌తో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరి అదే జరిగితే కూటమికి ఓటమి తప్పదని, సింగిల్‌గా బరిలో దిగిన అధికార పార్టీకి విజయం తథ్యమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Latest Articles

చియాన్ విక్ర‌మ్ 62వ చిత్రం ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజర్ రిలీజ్

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్