ఏపీలో ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. 10 మంది డైవింగ్ బృందం సమక్షంలో అండర్ వాటర్ ఆపరేషన్ చేపటింది సర్కార్. స్కోబా డైవింగ్ చేస్తూ నదిలో 12 అడుగులు లోపలికి వెళ్లిన సభ్యులు కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోస్తున్నారు. అయితే,.. నిన్న రాత్రి వరకూ కటింగ్ పనులు జరిగినా తొలగింపు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో.. ఇవాళ మూడవ రోజు పనులనే మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ఒక పడవన పూర్తిగా కట్ చేసి బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది.
అండర్ వాటర్ ఆపరేషన్‌కు ముందు భారీ క్రేన్లతో పడవను తొలిగించేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఒక్కొక్కటి 40 టన్నుల బరువున్న 3 భారీ పడవలు సహా ఓ మోస్తరు బరువు ఉన్నమరో పడవ కలిపి మొత్తం4 చిక్కుకుని కదలక పోవడంతో బోట్లను తొలగించడం కష్టతరంగా మారింది. దీంతో అండర్ వాటర్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీంలను అక్కడికి రప్పించింది సర్కార్.
ఇక ఇదిలా ఉంటే, ఏపీలో బోట్ వార్‌తో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. కొట్టుకువచ్చిన బోట్లు మీవంటే మీవంటూ టీడీపీ, వైసీపీల మధ్య మాటల దాడి నడుస్తోంది. జగన్ కుట్రలో భాగమేనని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తోంటే.. వారికి కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ చెప్పేదంతా అబద్దమని.. అసత్య ప్రచారం చేస్తోందని వైసీపీ వాదిస్తోంది.