GST వసూళ్లు తగ్గడంతో రేవంత్ సర్కార్‌పై ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో బుల్డోజర్ రాజ్ సంస్కృతిని తీసుకురావటంతో ఫలితాలు కూడా బుల్డోజర్ ఎకానమీ మాదిరిగా వస్తున్నాయ్ అని సెటైర్లు వేశారు. గతేడాదితో పోల్చుకుంటే తొలిసారిగా తెలంగాణలో GST వసూళ్లు 1 శాతం కంటే తక్కువకు పడిపోయాయి. GST వసూళ్లలో తెలంగాణ ఎప్పుడు కనీసం 15 శాతం వృద్ధిని సాధించేదని.. తెలంగాణ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో విజయవంతంగా పోటీపడుతోందని పోస్ట్ చేశారు.
విధ్వంసకర విధానాలతో GST వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానంలో నిలిచి అనూహ్యమైన ఘనతను సాధించిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ మాత్రమే మంచి పనితీరు కనబరుస్తూ గొప్పగా ఫలితాలనిస్తోందని రాసుకొచ్చారు. తెలంగాణ వంటి సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రత్యేక ప్రతిభ అవసరమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ తిరోగమన పరిస్థితిపై సీఎం సమాధానం చెబుతారని ఆశిస్తున్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


