స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై. రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన దశాబ్ది అవతరణ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేకంగా తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్.. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన గవర్నర్.. వీరిని కలుసుకోవడం సంతోషంగా ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిలో కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇన్ఫర్మేషన్ , అగ్రికల్చర్ ఇతర రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించిందని అన్నారు. తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమే కాదని.. తెలంగాణలోని ప్రతి గ్రామానికి ఫలాలు అందితే నే నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుందని అన్నారు. కొంత మంది మాత్రమే అభివృద్ధి చెందితే దానిని అభివృద్ధి అనరు అని వ్యాఖ్యానించారు.
“ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేను పిలుపిస్తున్నా.. సరికొత్త తెలంగాణ నిర్మాణం చేసుకుందాం. జై తెలంగాణ అంటే కేవలం ఒక నినాదం కాదు. అది ఒక ఆత్మ గౌరవ నినాదం. తెలంగాణ అమర వీరులకు నా అభినందనలు. నా తెలంగాణ అక్కా చెల్లెలకు , అన్నా తమ్ముళ్లకు నా అభినానందనలు. దేవుడు నన్ను తెలంగాణకు పంపడం గొప్ప అదృష్టం గా భావిస్తున్నాను. నేను మీతో ఉన్నాను మీరు నాతో అన్నారు” – తమిళి సై


