మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఈ నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది.
ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది.
ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ సభకు తరలి రానున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు.


