శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మూడు గేట్లను 10 అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 878.40 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 180 టీఎంసీలు నీటి నిల్వ ఉంది.
వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో మూడు గేట్లను ఎత్తిన అధికారులు.. ఒక్కో గేటు నుంచి 27వేల క్యూసెక్కులను విడుదల చేశారు. 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 81వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి సందడి చేశారు.


