మాజీ సిఎం జగన్‌రెడ్డి భద్రతపై.. చంద్రబాబు ప్రభుత్వానిది తీవ్ర నిర్లక్ష్యం అంటూ వైసిపి విమర్శిస్తోంది. పాతబడిన బుల్లెట్‌ఫ్రూప్ వెహికల్‌ను కేటాయించారంటూ ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వినుకొండ వెళ్తున్న సందర్భంగా కదలని బుల్లెట్‌ప్రూఫ్ వెహికల్ ఇచ్చారని కథనాలు కూడా వచ్చాయి. మాజీ సిఎం జగన్ ఇవాళ వినుకొండ వెళ్లిన సందర్భంగా ఆయన బులెట్ ప్రూఫ్ వాహనం మొరాయించిందని, దాంతో ఆయన తన ఫార్చ్యూనర్ కారులోకి ప్రయాణించారని వైసిపి నాయకులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతకి రిపేరులో ఉన్న కారుని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిందని ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సెక్యూరిటి నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి భద్రతను Z+ శ్రేణిలో కల్పించాలని వున్నది. దానిని అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. అయితే మాజీ సిఎంకి ఆక్టోపస్, APSP మొదలైన హంగు ఆర్భాటాలు ఉండవు. Z+ కేటగిరి ప్రకారం, బులెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేయాలి. జగన్ కోసం కేటాయించిన బులెట్ ప్రూఫ్ సఫారి కారుకి ఎటువంటి సమస్య లేదని, అది ఆగిపోలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఫార్చ్యూనర్ కారులో తిరిగడం అలావాటైన జగన్ కి సఫారి సౌకర్యవంతంగా లేకపోవచ్చని, అందుకే ఆయన దిగి వేరే కారులో ఎక్కి ఉండవచ్చునని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఆయనతో పాటు సఫారి కారు కూడా వెనకే వెళ్లిందని, కాబట్టి ఆ కారుతో ఎటువంటి సమస్య లేదనేది స్పష్టమవుతుందన్నారు. దీనికి రాజకీయ రంగు పులిమి, కావాలనే వైసిపి వారు ఆరోపణలు చేస్తున్నారని వారు అంటున్నారు.
విశేషమేంటంటే, ఇదే వాహనంలో ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లూ చంద్రబాబు నాయుడు ప్రయాణించారు. చంద్రబాబు పర్యటించినప్పుడు సరిగా ఉన్న వెహికల్ ఇప్పుడెందుకు ఉండదని టిడిపి నాయకులు ఆక్షేపిస్తున్నారు. చంద్రబాబు ప్రయాణించినప్పుడు మంచిగా ఉన్న వాహనం, ఇప్పుడు జగన్ ప్రయాణిస్తే డొక్కుదైందా అని ప్రశ్నిస్తున్నారు. సిఎంగా సుఖాలకి అలవాటుపడ్డ జగన్ 5 నిముషాలు కూడా పాత బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చో లేకపోయాడని ఎద్దేవా చేస్తున్నారు.
NSG భద్రతలో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కొన్ని వేల కిలోమీటర్లు అదే కారులో ప్రయాణించారని చెబుతున్నారు . కానీ ఆయన ఎన్నడూ తనకి పాత కారు సౌకర్యవంతంగా లేదని గాని, నా వాహనాలు మార్చండి అని గాని యాగీ చెయ్యలేదు. ప్రభుత్వం కక్ష కట్టింది అని రాజకీయం చేయలేదు. ఒంగోలు మహానాడుకు వెళుతున్నప్పుడు ప్రభుత్వ కారులో ఏసి పనిచేయక ఆయన ఎమ్మెల్యే కారులో ప్రయాణం చేశారు. నిబంధనలకు విరుద్దంగా బుల్లెట్ ఫ్రూప్ లేని వాహనంలో వెళ్లాల్సి వచ్చినా దాన్నొక ఇష్యూ చేయలేదు. అప్పటికే మూడు సార్లు సిఎంగా చేసిన ఆయన ఆ వయసులో అదే వాహనంలో ప్రయాణం చేశారు అని టిడిపి నాయకులు అంటున్నారు కానీ.. జగన్ కి మాజీ అయిన నెల రోజులకే ప్రభుత్వ కారు నచ్చలేదని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు. కంఫర్ట్ లేదు అని అనుకుంటే ఆయన తనకు నచ్చిన కారు కొనుక్కోవచ్చని, కానీ ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించిందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.