స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా బాలేశ్వర్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి చనిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి బాలాసోర్ జిల్లాలో స్థిరపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మృతిచెందడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం గురుమూర్తి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరోవైపు ప్రమాద బాధితులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు.
శనివారం రాత్రి ఏడుగురు ప్రమాద బాధితులు ప్రత్యేక రైలులో విజయవాడకు చేరుకున్నారు. వారి కోసం కుటుంబ సభ్యులు, స్థానిక నేతలు, అధికారులు విజయవాడ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. దీంతో బాధితులు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులలను చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కోరమాండల్, యశ్వంత్‌పూర్ రైళ్లలో ప్రయాణించిన ఏపీకి చెందిన 141 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వీలైనంత త్వరగా వారిని ట్రేస్ చేస్తున్నామని వెల్లడించారు.