ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ప్రోటోకాల్ ను కాలరాస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని నియంత్రించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. తిరుపతి రెడ్డి, ఏ అధికారిక హోదా లేకున్నా, ప్రభుత్వ కార్యక్రమాల్లో అనధికారికంగా వ్యవహరిస్తున్నారని, ఈ చర్యలు అధికార దుర్వినియోగాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కార్పొరేటర్.. ఇలా ఏ అధికారిక హోదా లేకున్నా తిరుపతి రెడ్డి, వికారాబాద్ లో జరిగిన ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శంకుస్థాపన సందర్భంగా పోలీసు కాన్వాయ్, స్కూలు పిల్లలతో పరేడ్ నిర్వహించి స్వాగతం పలకడంతో పాటు రాచమర్యాదలు పొందేలా అనధికారికంగా పాల్గొన్న తీరును తప్పుబట్టారు. ఏ అధికారిక హోదా లేకున్నా, ప్రభుత్వ కార్యకలాపాల్లో అనధికారంగా వ్యవహరించటం ఆమోదయోగ్యమా? అని సుభాష్ ప్రశ్నించారు. ఇక తిరుపతి రెడ్డి పక్కనే వికారాబాద్ కలెక్టర్ ఓ బాడీగార్డుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని అన్నారు.
గతంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో సోనియా గాంధీ అనధికారికంగా “షాడో పీఎం” గా వ్యవహరించారని సుభాష్ గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వ పాలనలో ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాల్లో సోనియా గాంధీ జోక్యం చేసుకున్న సంస్కృతినే నేడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అనుసరిస్తున్నారంటూ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి వ్యవహారం కేసీఆర్ కుటుంబం యొక్క అహంకార పోకడలకు, అనధికారిక చర్యలనే తలపిస్తోందని సుభాష్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరుడిని నియంత్రించకపోతే, ప్రజాగ్రహానికి గురవ్వడం ఖాయమని, రాజకీయంగా కేసీఆర్ కుటుంబానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సుభాష్ డిమాండ్ చేశారు.