స్వతంత్ర వెబ్ డెస్క్: అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతాం.. ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం మాత్రమే.. బీజేపీ పార్టీకి సంబంధం లేదు.. అంటూ కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. ఇటీవల ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడిన ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు.. లంబాడాలను ఎస్టీ రిజర్వేషన్ల నుంచి తొలగించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాట్లాడిన కిషన్ రెడ్డి ఈ విధంగా స్పందించారు. కాగా.. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వరంగల్ నగరాన్ని, ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ముంపునకు గురైన ప్రాంతాలను కిషన్ రెడ్డి పరిశీలించారు. భద్రకాళి చెరువు తెగిన ప్రదేశాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ఉన్న సౌకర్యాలు.. అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించినట్టు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలోనే కేంద్ర బృందం తెలంగాణకు రానుందని వెల్లడించారు. మూడు రోజులపాటు కేంద్ర బృందం వరద ప్రాంతాలను సందర్శించి వివరాలు సేకరిస్తుంది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కూడా తీసుకుంటుందని వివరించారు. వరదల వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించడంపై కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భూపాలపల్లి, తదితర ప్రాంతాలలో కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరదల పరిస్థితి.. పంట, ప్రాణ నష్టం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. కిషన్ రెడ్డితోపాటు.. వెంట పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.