స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్‌ను రెచ్చగొట్టాలని తాము చూడటం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. ఖలిస్థాన్ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండవచ్చునని ఆయన చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. ఈ క్రమంలో ఆయన మరోసారి స్పందించారు. భారత్‌ను రెచ్చగొట్టాలని లేదా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాలని చూడటం లేదన్నారు. కానీ సిక్కు నేత హత్యను మాత్రం తీవ్రంగా పరిగణించాలని తాము భారత్‌ను కోరుతున్నామన్నారు.
ప్రతి విషయంలో స్పష్టంగానే ఉన్నామన్నారు. భారత్‌తో కలిసే పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, జూన్ నెలలో సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందనే ఆరోపణలతో తొలుత కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరించగా, దీటుగా స్పందించిన భారత్ ఇక్కడి కెనడా దౌత్యవేత్తపై వేటు వేసింది. ఈ నేపథ్యంలో ట్రూడో వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.