విద్యార్థుల మరణాలు విశ్వవిద్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా..?విద్యార్థుల సంరక్షణ నామమాత్రంగా మారిందా..? వనరులు కరువయ్యే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారా..? స్టూడెంట్ల సూసైడ్‌తో విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోందా..? అంటే అవుననే సమాధానమే వినిపి స్తోంది. మరి ఎందుకా మరణాలు..? బాసర ట్రిబుల్ ఐటీలో అసలేం జరుగుతోంది.?
చదువుల తల్లి సరస్వతి కొలువై ఉన్న బాసరలో విద్యార్థుల వరుస బలవన్మరణాలు కలవరపె డుతున్నాయి. గ్రామీణ విద్యార్థుల బంగారు భవితవ్యం కోసం ఏర్పాటైన రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో మరణమే శరణ్యమనే పరిస్థితితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి కానరాని లోకాలకు వెళ్తున్నారు విద్యార్థులు. 2008లో విశ్వవిద్యాలయం ప్రారంభంకాగా 2023 జూన్ 13 వరకు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2023 జూన్ 15 నుంచి ఇప్పటి వరకు మరో ఆరుగురు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అయితే, ఈ బలవన్మరణా లకు పాల్పడుతున్న వారందరూ గ్రామీణ, పేద విద్యార్థులే. నూతన వాతావరణం, కొత్త పరిచయాలకు అనుగుణంగా ఇముడలేకపోవడం, భావి జీవితాన్ని నిర్దేశించుకునే క్లిష్ట పరిస్థితులను తట్టుకోలేక మరణ మే శరణ్యమని ఆర్జీయూకేటీ వసతిగృహాల్లోనే ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వాల నిర్ల క్ష్యం, ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
పల్లెలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతిలో ప్రతిభ కనబర్చే విద్యార్థులను మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2008 మార్చిలో నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. రాష్ట్రంలో మిగిలిన విశ్వవిద్యాలయాలకు భిన్నంగా ఇది సాంకేతిక విద్యకు మాత్రమే ప్రాధాన్యం కలిగిన విద్యాలయంగా ప్రసిద్ధి పొందింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ప్రతిభ కలిగిన గ్రామీణ విద్యార్థులకు ప్రవేశం ఉండేలా విశ్వవిద్యాలయం రూపకల్పన జరిగింది. అయితే 2008 నుంచి 2010 వరకు ఏడాదికి 2 వేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించగా2010 నుంచి ఆ విధానాన్ని మార్చారు. ఏడాదికి వేయి మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2015లో విశ్వవిద్యాల యం బడ్జెట్‌ని పెంచుకునే ఆలోచనతో.. గ్రామీణ ప్రాంత విద్యార్థులతో సంబంధం లేకుండా విద్యార్థులెవ రైనా లక్ష రూపాయల ఫీజు చెల్లిస్తే గ్లోబల్ సీట్ కింద అదనంగా వంద సీట్లు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభ మైంది.
ఒక లక్ష్యంతో ప్రారంభమైన ట్రిబుల్ ఐటీ ఆ తర్వాత విధానాలను మార్చుకుంటూ వస్తోంది. ఇక ఈ క్రమంలోనే 2023 విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్ పరీక్షలకు బదులు యానువల్ మోడ్ అమలు చేయడం విద్యార్థులపై ప్రభావం పడింది. సెమిస్టర్ విధానమైతే వెనకబడిన సబ్జెక్టుల్లో నాలుగు నెలల్లో విద్యార్థిలోపాలను సవరించుకుని తర్ఫీదు పొందే వెసులుబాటు ఉండేది. వార్షిక విధానంలో సిలబస్ పూర్తయినా కాకపోయినా విద్యా సంవత్సరాంతంలో ఒకేసారి పరీక్షలు రాసే విధానం అమల్లోకి రావటంతో విద్యార్థులు కలరవంలో పడ్డారు. మరోపక్క ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, కొత్త పరిచయాలతో దిగాలుగా ఉండే విద్యార్థులను గుర్తించి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇచ్చే విధానం లేకపోవడం స్టూడెంట్స్ మరణానికి ఒక కారణమైతే రెగ్యులర్ వీసీ లేకపోవటం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయంలో సమస్యలపై దృష్టి సారించి బలవన్మరణాలను ఆపాలని కోరుతున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.