తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ పరిపాలన భవనంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు.
డీఎస్పీ రమణ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని చంద్రబాబు సీరియస్ అయ్యరు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్‌రెడ్డిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌ను బదిలీ చేస్తున్నామని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై జ్యూడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించామన్నారు.
టీటీడీ ద్వారా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామన్నారు. తిమ్మక్క, ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయని… వారికి రూ.5 లక్షల చొప్పున సాయం చేస్తామన్నారు. గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలనే సంకల్పం వారిలో ఉంది… 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని చంద్రబాబు తెలిపారు.