సేవలు, పదవులు రాజకీయాల్లో రెండు కామన్ పదాలే. అయితే, కొందరు సేవే పరమావధిగా భావిస్తారు, మరి కొందరు అధికార పీఠాలు లేకుండా మనుగడ కష్టంగా భావిస్తారు. పొలిటికల్ సర్కిల్స్ లో దశాబ్దలగా ఆ నేతలదే పైచేయిగా కనిపిస్తుంది. పార్టీలు, జెండాలతో సంబంధం లేకుండా పదవులు దక్కించుకోవ డంలో ఆ నేతలు రాజకీయ ఘనాపాటీలు. ఇంతకీ ఆ నాయకులకు ప్రజా సేవే పరమావధా, లేక ప్రభు త్వంలో అగ్రపీఠాలు లేకపొతే ఉండలేరా.? ఎప్పటిక ప్పుడు మంత్రివర్గంలో బర్త్ కోసం రాజకీయ చతురత ప్రదర్శించే ఆ నేతలేవరు..?
అదృష్టమే అనుకోవాలో, రాజకీయ చతురత అనుకోవాలో, సమర్థతే అనుకోవాలో తెలియదు కాని ఏ పార్టీ అధికార పీఠం కైవసం చేసుకున్నా ఆ నేతలు గొప్ప గొప్ప పదవులు అలంకరించేస్తూనే ఉన్నారు. మూడున్నర దశాబ్దాల రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ నాయకునికి ఆయా పార్టీలు పట్టం కడుతున్నాయని ఆ నేతల అభిమానగణం తెగ సంబర పడిపోతోంది. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ అరంగేట్రం అనంతరం టీడీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. అనంతరం చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తరువాత వైఎస్ హయాం మినహాయిస్తే, తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ వైపు తుమ్మల చూపు సారించారు. హైదరాబాద్ లొ జరిగిన సీడబ్లుసీ సమావేశాల్లో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు.
ఇదే కోవలో మరో సీనియర్ నేత కడియం శ్రీహరి సైతం తన రాజకీయ చతురతతో పదవులు పొందు తున్నారు. టీడీపీ లో రాజకీయ రంగప్రవేశం చేసిన కడియం శ్రీహరి 1994 లో ఎన్టీఆర్ క్యాబినెట్ లో మార్కెటి౦గ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం చంద్రబాబునాయుడు క్యాబినెట్ లో నీటి పారుదల, విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు టీడీపీ నుంచి అప్పటి టీఆర్ఎస్ లో చేరి ఎంపీగా పొటీ చేసి గెలుపొందారు. నాటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ ఎస్ గా మారిన విషయం తెలిసిందే. తదనంతరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కడియం ఎన్నికై డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ ఎస్ బీ ఫాం మీద స్టేషన్ ఘనపూర్ నుంచి గెలుపొందారు. అనంతరం, ఆయన కుమార్తెకు ఎంపి టిక్కెట్ దక్కినా గులాబి బాస్ కీ బాయ్ చెప్పి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోన్నారు. తన కుమార్తె కడియం కావ్యకు కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ దక్కేలా చేసి, ఎన్నికల్లో గెలిపించడంలో కృతకృత్యులయ్యారు. ఇలా, కడియం తన రాజకీయ వారసురాలిగా ఆమెను చట్టసభలకు పంపడంలో సక్సస్ అయ్యారు.
మరో నేత జూపల్లి క్రిష్ణారావు కాంగ్రెస్ లొ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వైఎస్ క్యాబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2011లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి హర్షవర్ధన్ రెడ్డి మీద ఓడిపోయారు. 2023 ఆగష్టు 3న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసి ఆ ఎన్నికల్లో గెలు పొందారు. అనంతరం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం.. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు పరిమితం కావడంతో వైసీపీ నేతలు బీ ఆర్ ఎస్ లోకి వెళ్ళారు. ఇదే పంథాను పొంగులేటి అవలంభించారు. అనంతర కాలంలో ఖమ్మం జిల్లాలో ఇతర నేతల పెత్తనం పెరగడం, బీఆర్ఎస్ లో సముచిత స్థానం దక్కక పోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరని ఆయనపై ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తెలంగాణ జన గర్జన పేరిట ఖమ్మం లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించగా, ఆ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో పొంగులేటి రెవెన్యూ, హౌసింగ్, ఐ అండ్ పీ ఆర్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం తొలుత కాంగ్రెస్ లో పని చేసినవారే. 1984లో టీడీపీలో చేరి బాన్సువాడ నుంచి గెలుపొం దారు. అనంతరం 1998-99 వరకు చంద్రబాబు క్యాబినెట్ లో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999-2002 వరకు టీడీపీ సర్కారులో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసిఆర్ తొలి క్యాబినెట్ లో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన కు స్పీకర్ పదవి కట్టబెట్టారు. 2023 ఎన్నికల్లో రేవంత్ సర్కార్ ఏర్పాటయ్యాక పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కీలక నేత దానం నాగేందర్. 1994, 1999, 2004 వరకు వరుసగా ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలుపొందారు. అనంతరం టీడీపీ లో చేరి మరో సారి గెలుపొందారు. తర్వాత టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణానంతరం ఏర్పడిన రోశయ్య క్యాబినెట్ లో సైతం ఆయన పని చేశారు. అనంతరం ఖైరతా బాద్ లో ఓడిపోయారు. తదనంతరం బీ ఆర్ ఎస్ లో చేరి 2018, 23 లో బీ ఆర్ ఎస్ బీ ఫాం మీద గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయాల్లో పలువురు నేతలు, పార్టీలు, జెండాలు, ఎజెండాలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కీలక పదవులు పొందుతున్నారు.