స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి ప్రతిపక్షాల నుంచి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాత్రమే హాజరవుతుండడం విశేషం. మరోవైపు మోదీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ సీఎంలతో పాటు యూపీఏ భాగస్వామ్య పార్టీల సీఎంలు కూడా నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతారని నిన్నటి వరకు బీఆర్‌ఎస్ వర్గాలు చెప్పినా చివరి నిమిషంలో ఆయన కూడా దూరంగా ఉండాలని భావించారు. తొలుత నీతి ఆయోగ్ భేటీకి హాజరై.. తర్వాత ప్రతిపక్షాల నేతలను కలుసుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుకున్నారు. అయితే ఆమె కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. కాగా 2045 కల్లా దేశాన్ని అభివృద్ధి చేసేందుకు రోడ్ మ్యాప్ రూపకల్పనకు ఈ సమావేశం ఉపయోగపడనుందని నీతి ఆయోగ్ ఓ ప్రకటన జారీచేసింది.