స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రస్తుతం గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో అయితే ఒకేసారి నవ దంపతులు ఇద్దరు గుండెపోటుకు గురయ్యారు. మూడుముళ్లతో ఒక్కటై మూడు గంటలు కాక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రతాప్ యాదవ్ అనే 22ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల పుష్ప అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లితంతు ముగియడంతో వధూవరులను శోభనం గదిలోకి పంపించారు. అయితే తెల్లారేసరికి ఇద్దరూ మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో మరణించారని పోస్టుమార్టంలో తేలింది. మే 30న జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


