కేలండర్‌లో మరో సంవత్సరం మారిపోతోంది. 2024కు కేవలం ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. న్యూ ఇయర్ 2025కు కళ్లు చెదిరేలా వెల్ కం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు అంతా. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. భాగ్యనగరంలో మాత్రం నూతన సంవత్సరం వేళ గంజాయి గబ్బు గుప్పుమంటోంది. మత్తు పదార్థాలు యథేచ్చగా చేతులు మారుతున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలిలో ఓ పబ్‌పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన 8 మందిని అదుపులోనికి తీసుకున్నారు. ఇదే సమయంలో సే నో టు డ్రగ్స్ అంటున్నారు సెలబ్రిటీస్. మరి.. గంజాయి గబ్బులో, డ్రగ్స్ మత్తులో న్యూ ఇయర్ వేళ రెచ్చిపోవాలని భావిస్తున్న యూత్‌కు పోలీసులు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక కొత్త సంవత్సర వేడుకలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు పోలీసులు. మద్యం సేవించి రోడ్లపై తిరిగితే కేసులు తప్పవని హెచరిస్తున్నారు. రోడ్లపై న్యూసెన్స్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధితో పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు డ్రగ్స్ వినియోగించకుండా పోలీసులు ఫోకస్ పెట్టారు. ట్యాంక్ బండ్ చుట్టూ రాత్రి 11 గంట లనుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. రాత్రి10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఐటీ కారిడార్లలో ఫ్లైఓవర్లు మూసివేసి ఉంచుతారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తారు పోలీసులు.
ఇక పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసులు నిఘా పెట్టారు. నార్కోటిక్, ఎక్సైజ్ పోలీసులు గత కొన్నిరోజులుగా బార్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో కఠినమైన నిబంధనలు ఉంటాయని పోలీసులు తెలిపారు. బార్లు, పబ్‌లలో మైనర్లను అనుమతించవద్దని ఇప్పటికే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ అమ్మినా, వినియోగించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.