సినీ నటి కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ నిన్న హైకోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ కోసం IPS అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని తదితరులు దాఖలు చేసిన పిటిషన్లలో పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. అందుకు సమయం కావాలని కోరారు. దీంతో విచారణను ఈనెల 15కు వాయిదా వేశారు.
పిటిషనర్ల అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించింది. తనపై అక్రమ కేసు బనాయించడంతో పాటు అరెస్టు చేసి వేధింపులకు గురిచేశారంటూ కాదంబరి జెత్వానీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ ఏడాది సెప్టెంబర్ 13న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం IPS అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ACP హనుమంతరావు, CI సత్యనారాయణ, హైకోర్టు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు, హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.