ఎన్నికలు సమీపిస్తున్నవేళ తెలంగాణలో మరో కొత్త పార్టీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అరడజనుకు పైగా పార్టీలు ఉండగా.. ఇప్పుడు మరో పార్టీ పెట్టడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇలాంటి, అలాంటి పేరుతో పార్టీ పెట్టడం లేదు. ఏకంగా టీఆర్ఎస్(TRS) పేరుతోనే పార్టీ పెట్టడానికి కొంతమంది బడా నాయకులు సిద్ధమయ్యారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ పేరు తెరమరుగైంది. ఇప్పుడు ఆ పేరును క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు అసంతృప్తి నేతలు. ఈ క్రమంలోనే తెలంగాణ రక్షణ సమితి లేదా తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రైతు సమాఖ్య(TRS) పేర్లతో పార్టీని రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు అసంతృప్తి నేతలు ఈ కొత్త పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వీరు ఆర్థికంగా, రాజకీయంగా కూడా బలంగా ఉన్నట్లు సమాచారం.