ఆస్పత్రిలో విధులు నిర్వహించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఓ గర్భిణీ స్త్రీ వరండాలోనే పురిటి నొప్పులు అనుభవించి బిడ్డకు జన్మనివ్వాల్సిన పరిస్థితి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి.. అర్థరాత్రి గర్భిణి తాటి సృజన పురిటి నొప్పులతో వచ్చింది. అయితే ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో ఆమె వరండాలోనే ప్రసవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన స్టాఫ్ నర్సు జయంతి తన స్నేహితురాలితో కలిసి హాయిగా ఇంట్లో కునుకు తీస్తోంది. విషయం తెలుసు కున్న గర్భిణీ బంధువులు హుటాహుటిన వెళ్లి స్టాఫ్ నర్సును తీసుకొచ్చే సరికే సృజన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణీకి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేకుండా సాధారణ ప్రసవం కావడంతో సరిపోయింది కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటని వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సృజన బంధువులు. స్టాఫ్ నర్స్ జయంతి తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.