35.8 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

నర్మద పుష్కరాలు … పుణ్యాలకు దారులు

నర్మదా నది పుష్కరాలు ఆరంభం అయ్యాయి. గంగా నది పుష్కరాలు పూర్తయ్యాయి. పుష్కరాల్లో ఒక్కో నదికి ఒక్కో శోభ ఉంటుంది. గంగా నది గొప్పదనాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. స్వర్గంలో మందాకినిగా, భూలోకంలో అలకనంద, గంగ నదిగా, పాతాళంలో భోగవతిగా మూడు లోకాల్లో గంగా నది ప్రవహించి త్రిపథ గా పేరు పొందింది. ఇప్పుడు పుష్కర శోభ సంతరించుకున్న నర్మదా నదికి సౌమ్యశీల నదిగా పేరుంది. నదీ స్నానం పుణ్యప్రదం కాగా పుష్కర నదీ స్నానం అపార పుణ్యఫలం. ఇక, నర్మదా నదిని దర్శించుకుంటేనే పుణ్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నర్మదా నదీ పుష్కర వైభవం పై స్వతంత్ర ప్రత్యేక కథనం.

జలం సమస్త ప్రాణకోటికి ప్రథమ అవసరం. జలరహిత సమాజం మనుగడ అసాధ్యం. విశ్వంలో మూడు వైపులా జలమే దర్శనమిస్తోంది. ఆకాశనుంచి వర్షించేది జలమే. పరోపకారమే నదుల లక్ష్యం. ఇతరుల అవసరాలకు నీళ్లివ్వడం తప్ప.. ఆ నీళ్లను ఏ నది తాగదు. చెరువులు, బావులు, కాలువలు, వాగులు, వంకలు, సరస్సులు, నదులు, సముద్రాలు..అంతా జలమే. సృష్టికి పూర్వమే జలం ఉన్నట్టు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. పంచభూతాల్లో జలం సైతం అతిప్రధానమైనదే.

పవిత్ర భారత దేశంలో ఎన్నో రీతుల్లో జలప్రవాహం జరుగుతోంది. ఎన్నెన్నో నదులు ప్రాణుల దాహార్తి తీరుస్తున్నాయి. మరెన్నో రీతుల్లో జలాలు ఉపయోగపడుతున్నాయి. దేశంలో ఎన్నో నదులు ఉన్నా.. ఇందులో పన్నెండు అతి పవిత్ర నదులకు పురాణ గ్రంథాలు అగ్రతాంబూలం ఇచ్చాయి. వీటినే పుష్కర నదులుగా పిలుస్తారు. ఈ పన్నెండు పుష్కర నదుల్లో ఉపనదులు సైతం ఉన్నాయి. ఉపనదులుగా ఉండి.. పుష్కర నదులుగా పేరు పొందినవి తుంగభద్ర, ప్రాణహిత. ఈ నదులకు సైతం పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తాయి.

బృహస్పతి మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నది పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కర వైభవ ఘట్టం ముగిసింది. ఇప్పుడు దేవగురువు బృహస్పది వృషభరాశి ప్రవేశంతో నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. దర్శన మాత్రంతో పుణ్యఫలం ఇచ్చే పవిత్ర నదిగా నర్మదా నదికి పేరుంది. ఈ కారణంగానే ఎందరో తపోదీక్షాపరులు ఈ తీర ప్రాంతంలో తపోధనులుగా ఉంటారు. కురుక్షేత్రంలో దానం చేసినా, గంగా తీర సమీపంలో తనువు చాలించినా, రేవా తీరం అంటే నర్మదా తీరంలో తపస్సు చేసినా ముక్తి కలుగుతుం దని పురాణ గ్రంధాలు చెబుతున్నాయి. నర్మదా నదీ తీరంలో తపోనిష్టతో పాటు పవిత్ర స్నానం ఆచరిస్తే, ఆ పుణ్యఫలాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు.

నర్మదా నది గొప్పదనాన్ని పరిశీలిస్తే…. మధ్యప్రదేశ్‌ అమర్‌కంఠక్ పర్వతాల్లో నర్మదా నది జన్మించింది. మొత్తం 1289 కిలోమీటర్లు మేర ప్రయాణం సాగించి గుజరాత్ బారూచ్ జిల్లాలో అరేబియా మహా సాగరంలో సంగమిస్తుంది. నర్మద నది ఒడ్డున ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో గొప్ప పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. నర్మదా నదీ పుష్కర యాత్రికులు, భక్తులు… ఉజ్జయినీ మహాక్షేత్రా నికి వెళ్లి, అక్కడ మహాకాళేశ్వరస్వామివారి జ్యోతిర్లింగ క్షేత్రాన్ని, మహాకాళీ శక్తి పీఠాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడి ఇతర దర్శనీయ ప్రదేశాలను వీక్షించి, ఇండోర్ మీదుగా అమరేశ్వర క్షేత్రానికి చేరుకోవచ్చు. నర్మదా పుష్కర నదీ స్నానం అనంతరం ఓంకారేశ్వరస్వామిని, అమరేశ్వరస్వామిని దర్శించుకుని తమ పుష్కర యాత్ర సఫలం చేసుకోవచ్చు

నదీ స్నానం ఉత్తమం, తటాక స్నానం మధ్యమం, ఇతర స్నానం అధమం అని చెబుతారు. అదీకాక ఈ స్నానాలన్నీ ప్రభాత సమయంలోనే చేయాలని, అలా చేస్తేనే రుషి స్నాన, మానుష్య స్నాన ఫలాలు దక్కుతాయని పెద్దలు తెలియజేస్తున్నారు. భళ్లున తెల్లారక స్నానం చేస్తే.. అది రాక్షస స్నానం అవుతుం దంటున్నారు. అయితే, పుణ్యనదీ పుష్కరాల సమయంలో ఈ హెచ్చరికలు పాటించాల్సిన పని ఏమీ ఉండదని పెద్దలు తెలియజేస్తున్నారు. పుష్కరాల పన్నెండు రోజులు ఏ సమయంలో స్నానం చేసినా పుణ్యఫలం సంప్రాప్తిస్తుందని చెబుతున్నారు. నర్మదా నదీ పుష్కరాల్లో దర్శన మాత్రానే పుణ్యం వస్తుందని వివరిస్తున్నారు.

పుణ్యనదీ పుష్కరాల సమయంలో సమస్త దేవతలు, సర్వ దైవాలు, పిత్రు దేవతలు పుష్కరాల పన్నెండు రోజులపాటు పుష్కర నదులను ఆవహించి ఉంటారని పవిత్ర పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా పితృదేవతల స్మరణకు, శ్రాద్ధ కర్మలకు, తర్పణాదులకు పుష్కర సమయం మంచి సందర్భమని పెద్దలు చెబుతున్నారు. దైవగణాలు, పిత్రుగణాలు పుష్కర నదులకు సూక్ష్మరూపంలో వస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. పుష్కర స్నానాలు చేసేవారికి, పిత్రు దేవతలకు పిండ ప్రధానాలు చేసే వారికి దేవగణాలు శుభాలు కల్గిస్తాయని సమస్త పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సమీప ప్రాంతాల ప్రజలు వివాహాది శుభ కార్యాలు చేయరు. తప్పని సరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి చేస్తారు. నర్మదా నదిని చూసినంతనే పుష్కర ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతున్నందున… దూర ప్రాంతాలకు చెందిన వారు నర్మదా నదీ పుష్కర స్నానానికి వెళ్లలేని వారు…ఆ నదీ జలాలను, పుష్కారాలకు వెళ్లివచ్చిన వారి ద్వారానో, మరో విధంగానో తెప్పించుకుని.. దర్శన భాగ్యపుణ్యంతో తరించవచ్చు. కొంత నర్మదా నదీ జలాన్ని సాధారణ జలంలో కలిపి ఉంచి పుణ్య స్నానం చేయవచ్చు. ఆ పుణ్యజలాన్ని భద్రపర్చుకుని ఏడాది పొడవునా పవిత్ర స్నానం చేసి నర్మదా పుష్కర జల పుణ్యస్నాన ఫలాన్ని పొందవచ్చు. ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాలు నర్మదా నదీ పుష్కర శోభతో విరాజిల్లుతున్నాయి. దేశంలో ఏ నదికి పుష్కరాలు వచ్చినా తప్పక వెళ్లే భక్తజనులు ఎందరో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పుడు నర్మదా నదీ పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించి తరించాలని వందలాది మంది భక్తులు నర్మదా నదీ తీరాలకు తరలి వెళుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్