స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం జగన్ కు నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ప్రతి ఏటా పద్ధతి ప్రకారం జరిగే ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ ఏపీ సర్కారు రద్దు చేయడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, తక్షణమే కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. అయ్యా! ముఖ్యమంత్రిగారూ మీ రివర్స్ పాలనలో ఇప్పటికే అన్నిరంగాలు తిరోగమనంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లాయని.. ఇప్పుడు ఎంసెట్ కౌన్సెలింగ్ కూడా మీకు అలవాటైన రివర్స్‌లో చేస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం చేశారని లేఖపై ఫైర్ అయ్యారు లోకేష్. పద్ధతిగా జరగాల్సిన 3వ విడత కౌన్సెలింగ్ రద్దుచేసి విద్యార్థులకి తీరని ద్రోహం చేశారు. మీకు ఇద్దరు పిల్లలున్నారు. రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ మేనమామనంటావు. కనీసం తండ్రి మనసుతో ఆలోచించినా మంచి బ్రాంచిలో ఇంజనీరింగ్ చేయాలనే కలలు కల్లలైన పిల్లలు చేతులు కోసుకుంటూ, రక్తాలతో రాస్తున్న లేఖలు చూసైనా మనసు కరగ దా? అని ప్రశ్నించారు. 3వ విడత కౌన్సెలింగ్‌లో తమకి దగ్గరలో కోరుకున్న బ్రాంచి వస్తుందని నిరీక్షిస్తున్న వేలమంది విద్యార్థులు, నీ రివర్స్ దెబ్బకి తల్లిదండ్రులకి మొఖం చూపించలేక ఆత్మహత్యాయత్నాలకి పాల్పడుతున్నారని ఆగ్రహించారు.