నేచురల్ స్టార్ నాని.. ‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ వచ్చేసింది. సినిమా షూటింగ్ కూడా మొదలు కాకుండానే విపరీతమైన అంచనాలు నెలకొన్న సినిమాగా ది ప్యారడైజ్ హైప్ క్రియేట్ చేసింది. నానికి దసరా బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల .. ఈసారి అంతకు మించిన వయొలెన్స్, ఎలివేషన్స్‌తో వచ్చాడు. ఆయన పలు సందర్భాల్లో చెప్పినట్టుగానే అనౌన్స్‌మెంట్ టీజర్ కూడా అదే రేంజ్‌లో ఉంది. వంద సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో నాని చాలా భిన్నంగా కనిపించాడు. తాను చూపించబోయే కొత్త ప్రంపంచం ఎంత హింసాత్మకంగా ఉంటుందో శాంపిల్‌గా శ్రీకాంత్ ఓదెల ఈ టీజర్‌లోనే చూపించేశాడు.
టీజర్‌లో కథేంటో చెప్పకపోయినా కాన్సెప్ట్ రివీల్ చేశారు. పక్షుల్లో నిర్లక్ష్యానికి గురైన కాకులను ప్రపంచం ఎప్పుడూ చులకనగా చూస్తుంది. వాటి గురించి ఎవరూ రాయరు. అలా అణిచివేతకు గురైన ఒక జాతిని మేలుకొలిపేందుకు తల్వార్ పట్టిన నాయకుడు ఒకడు వస్తాడు. అయితే అతని పుట్టుకే అవమానకరంగా జరిగినట్టుగా టీజర్‌లో చూపించారు. జనం ఛీ కొట్టే వేశ్య బిడ్డగా ఆ ఊరిలో అడుగు పెడతాడు. రెండు పొడవాటి జడలతో ప్యాంటు మాత్రమే వేసుకుని చేతిలో మారణాయుధాలు పట్టుకుని సమూహాన్ని నడిపిస్తాడు. నాని ఎందుకలా ఉన్నాడు.. రక్తంతో నిండిన గ్రామాన్ని ప్యారడైజ్ అని ఎందుకు అన్నారో చూడాలంటే ఇంకో ఏడాది ఆగాల్సిందే.
విజువల్స్ నిజంగానే మాట రాకుండా చేశాయి. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. ఓ వైపు జోరుగా వర్షం పడుతుంటే.. మరోవైపు అగ్ని కీలల మధ్య హీరో నాని ఎంట్రీ అదిరిపోయింది. ఒక్కసారిగా ఒక చీకటి ప్రపంచంలోకి తీసుకెళ్లి శవాల గుట్టల మధ్య నానిని వెనుకనుంచి చూపించిన తీరు కొత్తగా అనిపించింది. ఇప్పటిదాకా ఏ హీరో వేయని గెటప్ లో చూపించిన విధానం కొన్ని రోజుల పాటు గుర్తుండేలా ఉంది. ఇలాంటి నేపథ్యం ఇప్పటిదాకా రాలేదని చెప్పలేము కానీ ఇంత ఇంటెన్స్ పండించడం అరుదు. అనిరుధ్ రవిచందర్ బిజిఎం, జికె విష్ణు సినిమాటోగ్రపీ, ఏదో వేరే గ్రహంలో ఉన్నట్టు అనిపించే ఆర్ట్ వర్క్ అబ్బురపరిచేలా ఉన్నాయి. ఇక ఈ సినిమా చూడాలంటే 2026 మార్చ్ 26 వరకు ఆగాల్సిందే. మొత్తానికి ది ప్యారడైజ్ దసరాకు రెట్టింపు ఎలివేషన్ కంటెంట్ తో వస్తోందన్న నమ్మకం కలిగించింది.