స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ పుడమిపై ఎంతో మంది పుడుతుంటారు.. కానీ, కొంత మంది చరిత్రను సృష్టించి ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలంటి మహనుభావుల్లో ఒక్కరే తెలుగు ప్రజలంతా అన్న అన్ని పిలుచుకునే నందమూరి తారక రామారావు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డా.నందమూరి తారక రామారావు.. ఈ పేరు వింటే తెలుగు ప్రజల తనువులు పులకరిస్తాయి. కళామతల్లి ముద్దుబిడ్డగా, వెండితెర రాముడిగా, కృష్ణుడిగా, పేద ప్రజల దేవుడిగా ఎనలేని కీర్తి గడించిన ఎన్టీఆర్ జయంతి నేడు. 2023 మే 28న అన్నగారి శత జయంతి. నిమ్మకూరులో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, నాటకాల్లో అనుభవం సంపాదించి, చలనచిత్ర రంగంలో మకుటంలేని మహరాజుగా వెలుగొంది, రాజకీయ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని సంచలనం సృష్టించిన ఘనత తారక రామునిది.
ఎన్టీఆర్1923 మే 28న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు ఎన్టీఆర్ జన్మించారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తరవాతే ఆయన బి.ఎ. పూర్తిచేశారు. తొలి సంతానం కలిగిన తరువాత ఆయన రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. కానీ, ఆ ఉద్యోగం నచ్చక తనకు ఇష్టమైన సినిమాల్లో నటించడానికి మద్రాసు పట్టణానికి బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన ఆయన ఇంకా వెనుతిరిగి చూడలేదు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు అన్న ఎన్టీఆర్. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం.. పాత్రకే కొత్త అందాన్ని తీసుకురావడం ఎన్టీఆర్ ప్రత్యేకత. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు.
సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత. ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుంచి వచ్చింది. కార్మికుడి కరిగిన కండరాలలో నుంచి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుంచి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.. ఆశీర్వదించండి’ అంటూ 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. అక్కడితో ఆగలేదు.. ఓట్లేయండని జనంలోకి వచ్చారు. ఆయనకి జనం నీరాజనాలు పలికారు. చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ఆయన ప్రతి మాట ఓ తూటాగా.. ఆయన సందేశమే స్ఫూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెల్లింది. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించ బడ్డ నటుడు.. రాజకీయ నేతగానూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
అధికారం చేపట్టిన నాటి నుండి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు. తప్పుడు వాగ్దానాలు.. తప్పించుకునే ధోరణి ఆయన పాలనలో ఏనాడు దరిచేరనివ్వలేదు. ‘పేదవాడే నా దేవుడు.. సమాజమే నా దేవాలయం’ అంటూ కాషాయి వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్ష పూనారు ఎన్టీఆర్. నాడు ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగు దేశం పార్టీ’ అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లోనూ.. దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికీ అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ఠ పునాదులు.. ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.. అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం. ముప్పైమూడేళ్ల వెండితెర జీవితంలో, పదమూడేళ్ల రాజకీయ జీవితంలో నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్.. 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించినా తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. ఎన్టీఆర్.. ఈ పేరు ఒక ప్రభంజనం, ఒక చరిత్ర, భావితరాలకు ఆదర్శం.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన తారక రాముడి ఖ్యాతి తెలుగు వెలుగుతూ ఉన్నంత కాలం శాశ్వతం.