శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు ప్రస్తుతం సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాగబాబుకు కీలక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహించిన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే పలు మార్లు సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడారు.
కొద్దిరోజుల కిందట ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే రెండు టీడీపీ, ఒకటి బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పవన్ కల్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూలు వెలువడిన తరువాత నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును ఖరారు చేశారు.