అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీస్ తో, ఫ్యామిలీ స్టోరీస్ తో మెప్పించాడు కానీ.. మాస్ సినిమాతో మాత్రం మెప్పించలేకపోయాడు. అయినప్పటికీ.. మాస్ సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు. క్లాస్ ఆడియన్స్ ని మాత్రమే కాదు.. మాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకోవాలని ట్రై చేస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేస్తున్న మూవీతో మరోసారి మాస్ ప్రయత్నం చేస్తున్నాడు. మరి.. చైతు ప్రయత్నం ఫలిస్తుందా..?
అక్కినేని నాగచైతన్య జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నూతన దర్శకుడు వాసు వర్మ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. అయితే.. నాగచైతన్య నటుడుగా తొలి సినిమాతోనే మెప్పించి శభాష్ అనిపించుకున్నాడు. ఆతర్వాత ఏమాయచేశావే, 100 పర్సెంట్ లవ్, ఒక లైలా కోసం చిత్రాలతో సక్సెస్ సాధించాడు. అప్పటి నుంచి నాగచైతన్య ప్రేమకథా చిత్రాలకు కరెక్ట్ గా సెట్ అవుతాడనే పేరు వచ్చింది.
లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న చైతన్యకు మాస్ సినిమాలు చేయడం అంటే ఇష్టం. మాస్ ఆడియన్స్ ని మెప్పించాలి.. అన్నిరకాల పాత్రలు చేయగలడు అనిపించుకోవాలి అనేది చైతు ఆలోచన. అయితే.. మాస్ ని మెప్పించాలని చేసిన దడ, బెజవాడ, యుద్దం శరణం, సవ్యసాచి.. చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. అప్పటి నుంచి రూటు మార్చి తనకు బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలు చేస్తున్నాడు. మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు.. చిత్రాలతో వరసగా విజయాలు సాధించాడు. అయితే.. మాస్ ని మెప్పించాలనే ప్రయత్నం మాత్రం ఆపలేదు.
లేటెస్ట్ గా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో తెలుగు, తమిళ్ లో నాగచైతన్య ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇందులో చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో నాగచైతన్య కానిస్టేబుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ మూవీకి కస్టడీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా కాస్త యాక్షన్ తో ఉండే మాస్ మూవీనే. సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అరవింద్ స్వామి, ప్రియమణి.. ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందుతోంది. మరి.. ఈ సినిమాతో అయినా నాగచైతన్య మాస్ ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి.