ఆరు గ్యారెంటీల్లో మిగిలిన హామీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆరు గ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయి. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు లోక్‌సభ ఎన్ని కలు దగ్గర పడుతుండడంతో మిగిలిన వాటిపై ఫోకస్ పెట్టింది. మరో వారం రోజుల్లోనే రెండు గ్యారెంటీ లను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. మరో వారం రోజుల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్న రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్ హామీలను అమలు చేసేందకు కసరత్తును ముమ్మరం చేసింది. మార్చి 2 లేదా 3న ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం అమలు కోసం పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా పోర్టల్‌ను తయారు చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ పోర్టల్ సిద్ధమై అన్నీ కుదిరితే ఈ నెలాఖరులోనే ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారులకే డీబీటీ ద్వారా వారి ఖాతాలో జమ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.955. అయితే రూ.500కే గ్యాస్ ఇవ్వనున్న నేపథ్యంలో వినియోగదారులు అదనంగా చెల్లించిన రూ.455ను వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసేందకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోం ది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలు గత మూడేళ్లలో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకోవా లని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం 1.20 కోట్ల కనెక్షన్లలో 44 శాతం మంది ప్రతి నెలా ఒక సిలిండర్ వాడుతున్నట్లు పౌరసరఫరాలశాఖ గుర్తించింది. రేషన్‌కార్డున్న వారికే వర్తింపచేస్తే.. ఈ శాతం మరింత తగ్గు తుంది. మూడేళ్ల సగటును పరిగణనలోకి తీసుకోవాలని కొద్దిరోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం చర్చించినట్లు సమాచారం. గరిష్ఠ పరిమితి ఏదీ లేదని తెలుస్తోంది. గత మూడేళ్లలో ఒక కుటుంబం ఏడాదికి సగటున 8 సిలిండర్లు వాడితే ఆ కుటుంబానికి రూ.500 గ్యాస్ సిలిండర్‌లు ఏడాదికి ఎనిమిది ఇచ్చే అవకాశం ఉంది. ఏడాదికి సగటున అయిదు చొప్పునే వాడితే అయిదే ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పథకం అమలు మొదలయ్యాక.. మూడేళ్ల సగటు కంటే ఎక్కువ సిలిండర్లు వాడినా.. అదనపు సిలిండర్లకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ వర్తించదు. వాటికి పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.955 కాగా కేంద్రం రూ.40 సబ్సిడీగా ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఎంతమందికి అమలు చేస్తారు ఎన్ని సిలిండర్లు ఇస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.


