స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా హైదరాబాద్లో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీఆర్ఎస్ పార్టీపై, తెలంగాణ సర్కారుపై చేసిన విమర్శలపై ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. జేపీ నడ్డా వ్యాఖ్యలను తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థకి శాఖల మంత్రి హరీశ్ రావు ఖండించారు. నడ్డా.. తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని అన్నారు. సొంత రాష్ట్రంలో బీజేపీని గెలిపించుకోలేని నడ్డా.. తెలంగాణలో గెలిపిస్తారా? అని ప్రశ్నించారు. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే కనీసం పార్టీ పరువైనా దక్కుతుందని వ్యాఖ్యానించారు.
మరోవైపు తెలంగాణలో హంగ్ సర్కార్ వస్తుందంటూ ఆ పార్టీ నేత బీఎల్ సంతోశ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు తిప్పికొట్టారు. బీఎల్ సంతోశ్.. తెలంగాణలో హంగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఎల్ సంతోష్ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించారని.. తెలంగాణలోనూ బీఎల్ సంతోష్ వల్ల బీజేపీ పతనం ఖాయమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.