నిన్న మొన్నటి వరకు అది వ్యాపారం. నేడు అదే ఒక సామ్రాజ్యం. వ్యాపారులకు కాసులు కురిపించిన క్వార్ట్జ్ ఇప్పుడు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు బంగారు బాతుగా మారింది. ఆంధ్ర నుంచి చైనాకు విస్తరించిన క్వార్ట్జ్ వ్యాపారంపై ఓ అధికార పార్టీ ఎంపీ కన్నేసి అంతా నా ఇష్టం అంటున్నారు. ప్రజల ప్రయోజనాలు కాపాడాల్సిన ఆయన…ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకు ఎవరా ఎంపీ..? ఏదా అధికార పార్టీ..?
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఖనిజ సంపదకు పెట్టింది పేరు. ఇసుక, గ్రావెల్, సిలికా వంటి ఖనిజ సంపద విరివిగా దొరుకుతుంది. ఇప్పుడు అన్నింటి కంటే క్వార్ట్జ్ కాసుల పంట కురిపిస్తోంది. దీంతో ప్రజాప్రతినిధులు ప్రముఖులు అడుగుపెట్టారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. గూడూరు, సైదాపురం, పొదలకూరు ప్రాంతాల్లో ఉన్న మైనింగ్ వ్యాపారం వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో సాగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు కూటమి ప్రభుత్వం సహకారం కూడా వేమిరెడ్డికి పుష్కలంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి క్వార్ట్జ్ రంగానికి సంబంధించి ఓ పరిశ్రమ పెట్టేందుకు పనులు ప్రారంభించారు. హైదరాబాద్ కేంద్రంగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి రెడ్డి కొంతమంది కలిసి రెండు మూడు నెలల క్రితం కంపెనీని రిజిస్టర్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కొత్తగా పెట్టిన కంపెనీ నుంచి కొంత క్వార్ట్జ్‌ను ఇప్పటికే చైనాకు ఎగుమతి చేశారు. అయితే ఎగుమతులకు సంబంధించి గనుల శాఖ అధికారులు ఎటువంటి పర్మిషన్ల మంజూరు చేయలేదని సమాచారం. అయినా గూడూరు ప్రాంతం నుంచి క్వార్ట్జ్ విమానాలు, షిప్‌ల ద్వారా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎగుమతి సాగిపోతోంది. దీనిపై మాట్లాడేందుకు గనుల శాఖ అధికారుల సైతం నిరాకరిస్తున్నారు.
గూడూరు, సైదాపురం, పొదలకూరు ప్రాంతాల్లో 260 క్వార్ట్జ్ లీజులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 30 మాత్రమే రెన్యువల్ చేశారు. మిగిలిన వారు అనుమతుల కోసం గనుల శాఖ చుట్టూ తిరుగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంత మైనింగ్‌లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. వాటిపై అధికారులు విచారణ చేపట్టి పలు కంపెనీలకు కోట్లాది రూపాయల జరిమానా విధించారు. ఈ జరిమానా వసూళ్లలో గనుల శాఖ అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిండికేట్ రూల్స్ ప్రకారం సైదాపురం క్వార్ట్జ్ మైనింగ్ ప్రాంతంలో ఎవరు ఖనిజం తవ్వినా, ఎంత మైనింగ్ చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం ఎంపీ వేమిరెడ్డి వంతు. అందుకు అవసరమైన సాయం ఆయన అనుచరులు అందిస్తారు. ముడి ఖనిజం తవ్వి తీసిన తర్వాత దానిని కచ్చితంగా ఎంపీకి అమ్మాల్సిందే. అది కూడా ఆయన చెప్పిన రేటుకే. ఈ విషయంలో ఎవరైనా కాదూ కూడదు అని ఎదురు తిరిగినా, నో చెప్పినా ఇక అంతే సంగతులు అన్న మాట. ఈ విషయాన్ని స్వయంగా మైనింగ్ యజమానులను అడిగితే చెబుతారు. లేదంటే జిల్లా ప్రజలు సైతం ఎంపీ మాటకు తిరుగులేదని చెప్పడమే దీనికి నిదర్శనం.
మరోవైపు సైదాపురం మైనింగ్ గనుల విషయంలో నెల్లూరు ఎంపీ చెప్పిందే వేదంగా అమలు చేస్తున్నారు అధికారులు. గనులపై ఎంపీ అజమాయిషీతో గనుల యజమానులు లబోదిబోమంటున్నారు. గనుల యజమానులను దారిలోకి తెచ్చుకునేందుకు అనుమతులు నిలిపేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.