లోక్‌సభ ఎన్నికల హడావుడి ముగిసి ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై విస్తృతంగా సమీక్షలు జరిపారు. దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, పెద్దసంఖ్యలో ప్రాణాలను బలిగొన్న అగ్నిప్రమాదాల గురించి ఆరా తీశారు. ఆస్పత్రులు బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి విపత్తుల నివారణకు క్రమం తప్పని తనిఖీలతో తగు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. రెమాల్ తుపాను కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో తలెత్తిన వరదల పరిస్థితు లను సమీక్షించారు. బాధిత రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మిజోరం, అస్సాం, మణిపుర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణం గా జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టాలపై ప్రధాని ఆరా తీశారు. ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని, ఆయా రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్న ట్లు అధికారులు తెలిపా రు.
రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలులు కొనసాగే అవకాశముందని ప్రధాని దృష్టికి తెచ్చారు. రుతుపవనాలు ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం, సాధారణం కంటే అధికంగా ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాధారణ కంటే తక్కువగా ఉంటాయని వివరించారు. జూన్ 4 నాటి ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత కొత్త ప్రభుత్వం అమలుచేయాల్సిన తొలి 100 రోజుల ప్రణాళికపై ప్రధానంగా దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను, అమలు చేయాల్సిన కార్యక్రమాల ప్రాధాన్యతా క్రమాన్ని సిద్ధం చేయాలని ఎన్నికలకు ముందే కేంద్ర మంత్రులకు ప్రధాని సూచించారు. అలాగే జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేయాల్సిన కార్యక్రమాలపైనా ఉన్నతాధికారులతో చర్చించారు.