స్వతంత్ర వెబ్ డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానించడం ఇదే తొలిసారి కాదని అన్నారు.
తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరుపెట్టి.. విషం చిమ్మడం సంస్కారహీనమని అన్నారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని మోదీ వ్యాఖ్యలను ఆక్షేపించారు. తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని దుయ్యబట్టారు. పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చడం సబబు కాదని అన్నారు.