ఢిల్లీ లిక్కర్ స్కాం లో మార్చ్ 10 వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈడీ నోటీసులు పంపింది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. కవిత బినామీగా పేర్కొంటున్న అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆమెను మరోసారి విచారణకు హాజరవ్వాలంటూ ఈడీ నోటీసులు ఇవ్వడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
కాగా ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే బీజేపీ తనని ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని, చట్టాలను గౌరవిస్తూ అధికారులకు విచారణలో సహకరిస్తానని తెలిపారు. అయితే ఢిల్లీలో ఈ నెల 10 న దీక్షలో పాల్గొనడంతోపాటు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో విచారణ తేదీని మార్చాలంటూ.. న్యాయ సలహా తీసుకుని ఈడీ అధికారులను కోరతానని ఆమె తెలిపారు.
న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. 10న ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేనని ఆమె లేఖలో పేర్కొన్నారు. 15న హాజరవుతానని సమయం కోరారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయ్యాయని ఈడీకి వివరణ ఇచ్చారు. ఈడీ నుండి సమాచారం వచ్చాక ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు.