స్వతంత్ర వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంపై స్టేషన్ ఘన్‌పూర్ (Station Ghanpur) ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ఢీలా పడిపోయారు. ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్(BRS) తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి(Kadiam Srihari) పోటీ చేయనున్నారు. దీంతో.. టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు.
అయితే.. టికెట్ దక్కకపోయినప్పటికీ.. అధినేత కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌లోలో చేరినప్పటి నుండి కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నా. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు’’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేక్రమంలో.. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన్ని పట్టుకుని విలపించారు.