స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల జాతర ఈ నెల 22న ప్రారంభం కానుంది. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గోల్కొండ కోట వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. గోల్కొండ బోనాలకు ఎంతో విశిష్ఠత ఉందని.. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఈ నెల 22 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్సవాలను నామమాత్రంగా నిర్వహించారని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాక బోనాల జాతరకి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుందని మంత్రి తెలిపారు. గోల్కొండతో మొదలయ్యే బోనాల జాతర.. జూలై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10న రంగం నిర్వహించనున్నారు. వచ్చే నెల 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు ఉంటుంది. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.