నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క పరామర్శించారు. బాధిత మహిళకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈశ్వరమ్మ కోలుకుంటుందని మంత్రికి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీతో సీతక్క మాట్లాడారు. కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితురాలికి భరోసా ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి తక్షణ సాయంగా 25 వేల చెక్ ను అందజేశారు సీతక్క. కొల్లాపూర్ మండలం మొల చింతలపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మపై.. ఆమె భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తులు పాశవికంగా దాడి చేశారు. ఈశ్వరమ్మ, భర్త ఈదన్న తమ వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చారు. ఆ భూమిలో వెంకటేశ్ ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రం పెట్టుకోగా తన దగ్గరే ఈదన్న, బాధితురాలు ఈశ్వరమ్మ పని చేసేవారు. ఈశ్వరమ్మ పనికి రావడంలేదని ఆమె మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


