గవర్నర్ ములుగు జిల్లా పర్యటనపై మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ నూతన గవర్నర్‌గా ఇటీవల జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. మొదటి పర్యటనగా ములుగు జిల్లాకు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. గవర్నర్ పర్యటకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మొదటగా జిల్లాకు చేరుకొని అర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో కొద్ది సమయం విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు జిల్లాలోని పలు సమస్యలు, అభివృద్ధి పనులపై సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.
అనంతరం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శిస్తారని మంత్రి చెప్పారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కోటగులను సైతం సందర్శిస్తారని వివరించారు. అక్కడి నుంచి గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని లక్నవరం సరస్సును సందర్శించి రాత్రి లక్నవరం సరస్సు ఐలాండ్‌లో బస చేస్తారని సీతక్క వివరించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా..ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని విజయవంతం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అంతకుముందు గవర్నర్ పర్యటకు సంబంధించి మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు.


