స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ సచివాలయం మూడో అంతస్తు సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభం కావడం మనకు గర్వకారణమన్నారు. వ్యవసాయ శాఖ తరపున జరిగే దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
రైతువేదికలను 3వ తేదీన సుందరంగా ముస్తాబు చేసి.. అలంకరించాలని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ విజయాలను తెలియపరుస్తూ పెద్దఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. రైతువేదికలలో పండుగ వాతావరణం కనిపించాలని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ముస్తాబు చేసి ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , అన్ని జిల్లాల డీఎఓలు తదితరులు పాల్గొన్నారు.