ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. సభ ప్రారంభమైన తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల అంశంపై చర్చించాలని వైసీపీ తీర్మానం ఇచ్చింది. దీనిని మండలి ఛైర్మన్ మోషేను రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యే మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.
వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చారని, సింహంలా సింగిల్‌గా నిలబడ్డారని కొనియాడారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించిన తర్వాతే.. ఆవేదనతో ఆయన చాలెంజ్ చేసి సభ నుంచి వెళ్లిపోయారన్నారు. అయినా చంద్రబాబు అసెంబ్లీకి రాకున్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారన్నారు. ఏనాడూ జగన్ కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.