- నేటి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
- భిన్న ప్రపంచంలో సహకారం అనే నినాదంతో సదస్సు
హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని దావోస్లో ఇవాళ్టి నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు-2023 జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొంటునున్నారు. సదస్సుకు హాజరయ్యేందుకు కేటీఆర్ బృందం ఆదివారమే దావోస్ బయల్దేరింది. స్విట్జర్లాండ్ చేరుకున్న ఆ టీమ్.. అక్కడి ప్రవాస భారతీయులతో కలిసి సంబురాలు చేసుకుంది.‘భిన్న ప్రపంచంలో సహకారం’ అనే నినాదంతో జరుగుతున్న సదస్సులో.. మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేస్తారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు కేటీఆర్ హాజరుకావడం ఇది ఐదోసారి. వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ భేటీ అవుతారు. పెట్టుబడులు, పరిశ్రమల సాధనకు పలు అవగాహన ఒప్పందాలు చేసుకునే వీలుంది.
ఈ సదస్సుకు దాదాపు 52 దేశాల అధినేతలు హాజరవుతున్నారు. 130 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొని.. ఆర్థిక, ఇంధన, ఆహార సంక్షోభాల పరిష్కారంపై చర్చిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపుతారు. భారత్ నుంచి కేంద్రమంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, అశ్వినీ వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్‌కే సింగ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే సహా పలు రాష్ట్రాల సీఎంలు ఈ సదస్సుకు హాజరవుతారు.
తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి.. ‘తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి’ అనేదే తమ నినాదమని మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను వివరించి, పెట్టుబడుల సమీకరణకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, అభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందని అన్నారు.
దావోస్ వచ్చిన ప్రతిసారి ఇక్కడి భారతీయులిచ్చే మద్దతు గొప్పగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన పనితీరుతో గొప్ప ప్రగతిని సాధిస్తున్న.. విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. విదేశాల్లో పండుగ జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రవాసులందరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.