అధికార పార్టీ నేతల తీరుతో ఒక్కోసారి పోలీసులు కూడా ఇబ్బందులు పడుతుంటారు. అధికారం ఉంది కదా? అని ఖాకీలను లెక్క చేయకుండా వ్యవహరిస్తుంటారు నేతలు. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. మచిలీపట్నం పర్యటనకు వెళ్లిన మంత్రి రోజాను అధికారులు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో మంత్రి జోగి రమేశ్ డీఎస్పీ మాసుం భాషా పట్ల దురుసుగా ప్రవర్తించారు. రోజాను ఆహ్వానించేందుకు ఎస్పీ జాషువా వెళ్తుండగా.. పక్కనున్న వారిని పక్కకు జరిపేందుకు డీఎస్పీ ప్రయత్నించారు. పొరపాటున జోగి రమేశ్ కు ఆయన చేయి తగలడంతో పక్కకు పో అంటూ డీఎస్పీపై కోపం ప్రదర్శించారు. డీఎస్పీ క్యాడర్ అధికారి పట్ల మంత్రి వ్యవహరించిన తీరుపై పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులంటే అధికార పార్టీ నేతలకు లెక్కలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.