గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మెటా సంస్థ ఝలక్ ఇచ్చింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే అకౌంట్లపై సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మెటా సంస్థ రాజాసింగ్ ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. రాజాసింగ్ పేరుతో ఉన్న రెండు ఫేస్ బుక్ పేజీలు, మూడు ఇన్‌స్టా ఖాతాలను తొలగించింది.
దీనిపై స్పందించిన రాజాసింగ్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదుతోనే తన అకౌంట్లను బ్లాక్ చేశారని ఆరోపించారు. హిందువులే లక్ష్యంగా సెలెక్టివ్ సెన్సార్‌షిప్ దాడి చేస్తోందని ఆరోపించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరుల అకౌంట్లను కూడా తొలగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“హిందువులను లక్ష్యంగా చేసుకొని సెలెక్టివ్ సెన్సార్‌షిప్ దాడి చేస్తోంది. గురువారం నా కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేయడం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన ఫిర్యాదు ఆధారంగా నా అధికారిక ఖాతాలకు అన్యాయం జరిగింది” అని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూటిగా స్టేట్‌మెంట్స్ ఇచ్చే రాజాసింగ్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చ్ 2వ తేదీ నుంచి 31వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే తమ ఇళ్లకు వెళ్లేలా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాజాసింగ్ మండిపడ్డారు. ఓ వీడియో ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఆంక్షలు విధించారని.. నవరాత్రుల్లో పాల్గొన్న హిందూ ఉద్యోగులపై కేసులు పెట్టి వేధించారని తెలంగాణ సర్కారుపై రాజాసింగ్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు ముస్లింలకు పని వేళలు పూర్తికాకముందే వెళ్లడానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల ఓట్లతో గెలవలేదా? కేవలం ముస్లింల ఓట్లతోనే గెలిచిందా? అని ప్రశ్నించారు. రాజాసింగ్ ఇటీవల సొంత పార్టీపైనే వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.