ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి తొమ్మిదో తేదీలోపు పెండింగ్ సమస్యలన్నిం టినీ పరిష్కరించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కొన్ని సిఫార్సుల ను అందజేసింది. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు ఉత్తర్వులను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ జారీ చేశారు. అన్ని స్థాయుల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాల ని ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యజమానులకు తెలియజే యాలని స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దారు కార్యాలయాల పరిధిలో తహసీ ల్దార్లు, డిప్యూటీ తహసీల్దా ర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో రెండు లేదా మూడు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణలు జరిపి.. విచారణ నివేదికలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపి స్తారు. పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్లు, డీఆర్‌డీఏ, వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు, పంచాయతీల కార్యద ర్శులను ఈ బృందాల్లో నియమిస్తారు. గ్రామాలు లేదా మాడ్యూళ్ల వారీగా దరఖాస్తులను ఈ బృందాలకు తహసీల్దార్లు అప్పగించి.. విచారణ నివేదికలు రూపొం దిస్తారు. వాటిని సంబంధిత ఉన్నతాధికారులకు పంపుతారు. దరఖాస్తుదారులకు గ్రామస్థాయి అధికారుల ద్వారా లేదా వాట్సప్, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో బృందాలు సమాచారం చేరవేస్తాయి. దరఖాస్తుదారుల వద్ద ఉన్న ఆధారాలతోపాటు రెవెన్యూ మూల దస్త్రాలను బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అవస రమైతే భూమిని కూడా పరిశీలిస్తారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి విచారణ నిర్వహించి.. పరిష్కారం లేదా తిరస్కరణలలో ఏదో ఒకటి నమోదు చేస్తారు. ఈ నెల 9వ తేదీ నాటికి ప్రతి దరఖాస్తును పరిష్క రించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కలెక్టర్ల వద్ద ఒక్క దరఖాస్తు కూడా మిగిలి ఉండటానికి వీల్లేదని ఉత్తర్వుల్లో CCLA స్పష్టం చేశారు.