మన్మోహన్ సింగ్‌కు తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ప్రధానిగా పేదలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. పేదలు పస్తులు ఉండొద్దన్న ఉద్దేశంతో పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించారు. అనంతపురంలో ఉపాధి హామీ పథకాన్ని లాంచ్ చేశారు మన్మోహన్ సింగ్. ఈ పథకం యూపీఏ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే పేదల కడుపు నింపింది.
మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ ఏపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారని… కేంద్ర కేబినెట్‌లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేస్తామన్నా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్‌లో రచ్చజరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు మన్మోహన్ సింగ్. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ చేయించేందుకు మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారన్నారు అప్పటి కేంద్రహోంమంత్రి షిండే.
కాంగ్రెస్ అధికారం కోల్పోయాక విభజన సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు మన్మోహన్ సింగ్. విభజన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే తప్పకుండా ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్లమన్నారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. నేడు ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు తెలంగాణ సీఎం. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ కృషి ఎప్పటికీ మరవలేమన్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.