స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపూర్ రాష్ట్రంలో ఎన్ బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వాసం కోల్పోయారని మణిపూర్ హింసాకాండకు చెందిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా తొమ్మిది మంది మైతీ వర్గానికి చెందిన శాసనసభ్యులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జాతుల మధ్య వైరంతో మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఒప్పుకొన్నారు. దీనికి సంబంధించిన మెమోరాండంను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించారు. ‘రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు’ అని అందులో పేర్కొన్నారు. హింసలో 100 మందికి పైగా మరణించారని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని మెమోరాండంలో తెలిపారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మైతీ, కుకీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపాలని కోరారు. మరోవైపు మైతీ వర్గ బీజేపీ, ఎన్‌పీపీ ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులను కలిశారు.
మణిపూర్ తగలబడుతుంటే మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లడం ఏంటని ఆప్ ప్రశ్నించింది. మణిపూర్‌లో శాంతిభద్రతలు పునరుద్ధరించాలని కోరుతూ ఇంఫాల్‌లో పూర్తిగా మహిళలే నిర్వహించే ‘ఎమా కీథల్’ మార్కెట్ ప్రతినిధులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ రోడ్డులో నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు ఆర్మీతో రక్షణ కల్పించాలంటూ కుకీలు దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. తమకు రక్షణ కల్పించడంతోపాటు తమపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కుకీ వర్గం పిటిషన్ దాఖలు చేసింది.