తీవ్ర తుపానుగా మారిన మాండూస్ ప్రభావానికి ఏపీలో ఆరు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం ఆరుజిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు.
తీరం దాటే సమయంలో 65 నుంచి 75 కిమీ వేగంతో గాలులు వీస్తుండటంతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. నెల్లూరు జిల్లాలో భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక్కడ సముద్రంలోని అలలు ఉవ్వెత్తున ఎగసి పడి 50 మీటర్ల ముందుకొచ్చి అక్కడ దుకాణాలను ముంచెత్తుతున్నాయి.
మాండూస్ తుపాన్ ఎట్టకేలకు తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరం దాటింది. చెన్నైతో సహా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులిచ్చారు. బయలుదేరాల్సిన 27 విమానాలను రద్దు చేశారు. చెన్నైలోని పలుప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. చెంగలపట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
ఏపీలో కూడా బాపట్ల, తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో కొండపైన భక్తులు చలికి, వర్షానికి వృద్ధులు, మహిళలు, పిల్లలు వణికిపోతున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి వాయుగుండం బలహీనపడనుందని వాతావరణ శాఖ సమాచారం.నెల్లూరు జిల్లా పెన్నా పరీవాహక ప్రాంతాల్లోని కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ముందస్తు జాగ్రత్తగా సోమశిల జలాశయం నుంచి పెన్నా నదిలోకి దిగువకు 20వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.