స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), మాదిగ రిజర్వేషన్(Madiga Reservation) పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ(Manda Krishna) మాదిగల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మాదిగల రిజర్వేషన్ పై ఇరువురి మధ్య గ్యాప్ బాగానే పెరిగింది. కాంగ్రెస్(Congress) కార్యాలయంలో నేరుగా పార్టీపైనే మంద కృష్ణ మాదిగ ఆ పార్టీ వైఖరిని ఎండగట్టారు. దీంతో రేవంత్ రెడ్డి కూడా అందుకు ధీటుగా సమాధానమిచ్చారు. దీంతో ఎన్నికల సమయంలో ఈ వివాదం ఎటు వైపునకు దారితీస్తుందన్నది చూడాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని వర్గాల వారినీ కలుపుకుని పోవాలని పార్టీలోని కొందరు నేతలు రేవంత్‌కు సూచిస్తుండగా, అలాంటిదేమీ లేదని, పార్టీని ఇబ్బందిపెడితే సరైన సమాధానమే ఇవ్వాల్సి ఉంటుందని మరికొందరు అంటున్నారు.
గాంధీభవన్‌లో(Gandhi Bhavan) ఇటీవల జరిగిన సమావేశంలో మందకృష్ణ మాదిగ ఆ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యానించారు. మాదిగ రిజర్వేషన్లకు పార్టీ అనుకూలంగా వ్యవహరించలేదన్న మంద కృష్ణ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ఇప్పటికైనా మాదిగ రిజర్వేషన్ల విషయంలో స్పష్టం చేయాలని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, దానికి ఒక పద్ధతి ఉంటుందని, వేరే పార్టీకి మద్దతిస్తూ తమ పార్టీపై బురద జల్లడమేంటని, ప్రస్తుతం మద్దతిస్తున్న పార్టీపై వత్తిడి తేవచ్చు కదా? అని రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగపై ఎదురుదాడికి దిగారు.
అయితే దీనికి మందకృష్ణ మాదిగ కూడా అదే స్థాయిలో స్పందించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మాదిగల అండతోనే గెలిచిన రేవంత్ రెడ్డి తమ సామాజికవర్గాన్ని అవమానపర్చేలా మాట్లాడటం సరికాదని అన్నారు. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయితే రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియదని, ఆయన ఒంటిపై ఎన్ని పార్టీల జెండాలు ఉన్నాయో చెప్పాలంటూ మందకృష్ణ మాదిగ సెటైర్ వేశారు. గాంధీ భవన్ లో తాము మాదిగ రిజర్వేషన్లకు సంబంధించి వైఖరి చెప్పాలంటూ వినతి పత్రం ఇస్తే ఇంతవరకూ ఎలాంటి రెస్పాన్స్ లేదన్నారు. రేవంత్ రెడ్డికన్నా పిట్టలదొర బెటర్ అని, ఆయనను ఎవరు ప్రశ్నించినా సహించరని అన్నారు.