మంచు ఫ్యామిలీలో గొడవలు రాజకీయ రంగు పులుముకోబోతున్నాయా? ఏదోఒక పార్టీ అండ లేనిదే ఈ వార్‌లో గెలవలేమని మంచు మనోజ్ భావిస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే చెప్పక తప్పదు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు కొన్నాళ్లుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంట్లో.. నాలుగు గోడల మధ్య జరగాల్సి పంచాయితీలు కాస్తా.. రచ్చకెక్కడం సినీ పరిశ్రమలోనే కాకుండా.. రెండు రాష్ట్రాల ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్యామిలీ వార్‌కు మొదటి నుంచి కారకుడని భావిస్తున్న మంచు మనోజ్.. ఇన్నాళ్లూ ఒంటరిగానే పోరాడాడు. కానీ.. బయట నుంచి మద్దతు లేనిదే తాను కూడా ఎక్కువ కాలం పోరాడలేనని మనోజ్ భావించారట. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీల వైపు చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి మంచు మనోజ్.. జనసేనలో చేరతారని మొదట టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తండ్రి మోహన్ బాబు, సోదరుడు విష్ణుతో ఉన్న గొడవల్ల తనకు గట్టి అండ టీడీపీ నుంచి అయితేనే దొరుకుతుందని మనోజ్ భావిస్తున్నారట. అందుకే తన ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు. బుధవారం తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మనోజ్.. అటు నుంచి అటే.. నారావారిపల్లెకు వెళ్లి మంత్రి లోకేశ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. టీడీపీలో చేరే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మంచు మనోజ్ భార్య భూమా మౌనిక సోదరి భూమా అఖిల ప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో అఖిల ప్రియకు, మౌనికకు మధ్య ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అవన్నీ ఉత్త ప్రచారాలే అని.. చెల్లెలు కుటుంబానికి రాజకీయంగా సహాయం చేయడానికి అఖిల ప్రియ ముందుకు వచ్చినట్లు తెలిసింది. అందుకే నారా లోకేశ్‌తో మంచు మనోజ్ భేటీ అయ్యారని.. త్వరలోనే ఆయన పసుపు కండువా కప్పుకుంటారనే టాక్ వినిపిస్తోంది.
మోహన్ బాబు గతంలో టీడీపీకి సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆ తర్వాత ఆయన వైఎస్ ఫ్యామిలీకి దగ్గరయ్యారు. వైఎస్ మరణానంతరం జగన్‌తో సన్నిహితంగా ఉన్నారు. విష్ణు భార్య వెరోనిక.. వైఎస్ జగన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తే. అందుకే మోహన్ బాబు, విష్ణు.. వైసీపీకి దగ్గరయ్యారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు, టీడీపీపై మోహన్ బాబు తీవ్రమైన విమర్శలు చేశారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి వీధుల్లో తన విద్యానికేతన్ విద్యార్థులతో కలసి ఊరేగింపులు, ధర్నాలు చేయించారు మోహన్ బాబు. ఇంత చేసినా ఏనాడూ జగన్.. మోహన్ బాబును దగ్గర తీయలేదు.
ఇటీవల మళ్లీ చంద్రబాబుకు, టీడీపీకి దగ్గర కావడానికి మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారు. భోగి, సంక్రాంతి పండుగల సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించిన సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో మోహన్ బాబు అధికార పార్టీ అండకోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఆ వెంటనే మంచు మనోజ్ మేల్కొని.. అర్జెంట్‌గా నారా లోకేశ్‌ను కలిశారు. తండ్రికంటే ముందే టీడీపీకి దగ్గర కావడానికి మనోజ్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారట. అయితే నారా లోకేశ్‌తో జరిగిన మీటింగ్‌లో ఏం జరిగిందనేది బయటకు రాకపోయినా.. పార్టీలో చేరిక గురించే ఎక్కువ చర్చ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి మోహన్ బాబు ఫ్యామిలీ ఇప్పుడు టీడీపీ అండ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో మంచు మనోజ్ కాస్త దూకుడుగా ఉన్నారు. మోహన్ బాబు మాత్రం నేరుగా చంద్రబాబును కలవడానికి ప్రయత్నాలు చేయడం లేదని.. కేవలం ఫ్లెక్సీల ద్వారా సందేశాన్ని పంపుతున్నట్లు తెలిసింది. మనోజ్ టీడీపీలో చేరకుండా ఆయన ఫ్యామిలీనే అడ్డుకుంటున్నట్లు తెలిసింది. మరి మంచు ఫ్యామిలీ వార్‌లో ఎవరికి టీడీపీ అండ దొరుకుతుందో వేచి చూడాలి.