ఈ శుక్రవారం అర డజనుకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ఇక్బాల్ దర్శకత్వం వహించిన ‘మన ఇద్దరి ప్రేమ కథ’. తనే హీరోగా నటించి, దర్శకత్వం వహించి నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
అనాథ అయిన నాని (ఇక్బాల్) శృతి (మోనికా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నాని ప్రేమను శ్రుతి యాక్సెప్ట్ చేశాక, వాళ్లిద్దరూ బీచ్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అయితే ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. నాని, శ్రుతి మధ్యలోకి అను (ప్రియా జస్పర్) అనే అమ్మాయి వస్తుంది. ఆమె రాకతో ఇద్దరి మధ్య బంధం బలహీనపడుతుంది. అదే సమయంలో నాని, అను ఇద్దరి సన్నిహిత వీడియో వైరల్ అవుతుంది. దీంతో సమీప గ్రామస్తులు వారిద్దరికీ వివాహం జరిపిస్తారు. అయితే శృతిని ప్రేమించిన నాని.. అనుకోకుండా పెళ్లి చేసుకున్న అనుతో కాపురం చేశాడా? ఈలోగా నాని ఎలాంటి పోరాటాలను ఎదుర్కొంటాడు? క్లైమాక్స్ సన్నివేశాల్లో షాకింగ్ డెవలప్మెంట్ ఏమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
డైరెక్టర్, హీరో అయిన ఇక్బాల్ కథ రాసుకున్న విధానం బాగుంది. దానికితోడు కథను నడిపించిన విధానం కూడా బాగుంది. ఎన్నో ముఖ్యమైన అంశాలతో కథను విజయవంతంగా నడిపించిన ఇక్బాల్‌ను అభినందించాలి. పక్కింటి అబ్బాయి పాత్రలో ఇక్బాల్ నటన బాగుంది. అతని ముఖ కవళికలు, హావభావాలు చాలా సహజంగా ఉంటాయి. ఇక్బాల్ తన నటనతో సినిమాను ప్రేక్షకుల గుండెల్లో నిలిచేలా చేశాడు. హీరోయిన్ ప్రియా జస్పర్ తెరపై ముద్దుగా ఉంది. తన నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రను ఆకట్టుకునే విధంగా చేసింది. మరో హీరోయిన్ మోనికా కూడా అంతే బాగుంది. మాజీ ప్రేమికుల పాత్రలో బాగానే నటించింది.
ఇక ఈ సినిమాలో లోపాలు , హైలెట్స్ విషయానికి వస్తే చెప్పుకుంటే రియలిస్టిక్ కథ తో చేసిన ప్రయత్నం బాగుంది.. అలాగే సంగీత దర్శకుడు రాయన్ సినిమా కు పెద్ద ఏసెట్ అనుకోవచ్చు… ఇక సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. సినిమాలో సహజమైన లొకేషన్లను చక్కగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదునుపెట్టాల్సింది. పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాణ విలువలు కొంతవరకు బాగున్నాయి.
తీర్పు:
ఒకవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు దర్శకుడిగానూ ప్రయత్నించిన ఇక్బాల్ ప్రయత్నం నిజంగా అభినందనీయం. ‘మన ఇద్దరి ప్రేమకథ’ అనేది మెసేజ్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీ. క్లైమాక్స్ షాకింగ్‌గా ఉండడంతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రేక్షకులు తప్పకుండా మాట్లాడుకుంటారు. ఈ వారం వచ్చిన చిత్రాల్లో తప్పకుండా చూడాల్సిన చిత్రంగా ‘మన ఇద్దరి ప్రేమకథ’ నిలిచింది.
ట్యాగ్ లైన్ : మన ఇద్దరి ప్రేమ కథ కొత్తగా ఉంది.
రేటింగ్: 2.75/5