స్వతంత్ర వెబ్ డెస్క్: మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు చంద్రాపూర్ ఎంపీ బాలు ధనోర్కర్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. అతని భార్య ప్రతిభా ధనోర్కర్ వరోరా-భద్రావతి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదిలా ఉంటే బాలు ధనోర్కర్ తండ్రి నారాయణ్ సుదీర్ఘ అనారోగ్యంతో శనివారం నాగ్‌పూర్‌లో కన్నుమూశాడు. ఆదివారం అతని అంత్యక్రియలు జరిగాయి. అయితే ఆ సమయంలో బాలు ధనోర్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో అంత్యక్రియలకు హాజరుకాలేదు. తండ్రి మరణించిన నాలుగు రోజుల్లోనే ఎంపీ కూడా మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కిడ్నీలో రాళ్లు ఉండటంతో అనారోగ్యం పాలైన బాలు మే26న నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత అతని ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు. మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే తెలిపారు.
బాలు ధనోర్కర్ 1975 మే4న యావత్మాల్ జిల్లాలో జన్మించారు. ఆయన రాజకీయ జీవితం శివసేనతో ప్రారంభమైంది. 2009లో శివసేన నుంచి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో భద్రావతి వరోరా నుంచి శివసేన ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత 2019లో శివసేనకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. మహారాష్ట్రకు చెందిన ఏకైక కాంగ్రెస్ ఎంపీ బాలు ధనోర్కర్.